pak cricketer: అది క్రికెట్ కాదు.. వ్యాపారం: ఐపీఎల్ పై పాక్ క్రికెటర్ వ్యాఖ్యలు
- ఇది ఆదర్శనీయమైనదేమీ కాదన్న రషీద్ లతీఫ్
- ఐపీఎల్ సమయంలో ఎన్ని గంటల పాటు క్రికెట్ చూశారని ప్రశ్న
- భారతీయులకు కాల్ చేసి అడగాలని సూచన
భారత ఐపీఎల్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులు ఇటీవలే రూ.48,390 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోవడం తెలిసిందే. ప్రపంచంలో రెండో అతిపెద్ద లీగ్ గా అవతరించింది.
ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ స్పందిస్తూ.. ఇది ఆదర్శనీయమైనది ఏమీ కాదని, ఇదంతా వ్యాపారం అంటూ వ్యాఖ్యానించాడు. ‘‘మనం ఇక్కడ క్రికెట్ గురించి మాట్లాడడం లేదు. వ్యాపారం గురించే మాట్లాడుతున్నాం. ఇది సరైన పరిస్థితి కాదు. కేవలం డబ్బుపైనే దృష్టి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు చాలా మంది డబ్బులు సంపాదించగలరు.
ఇది నాణ్యత గురించి కాదు. ఇది వ్యాపారం. ఏ భారతీయుడికి అయినా కాల్ చేసి ఐపీఎల్ సమయంలో ఎన్ని గంటల పాటు క్రికెట్ చూశారో అడగండి. నేను అయితే దీన్ని కేవలం వ్యాపారం అనే అంటాను. ఇది ఎలా కొనసాగుతుందో చూద్దాం’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. పరోక్షంగా ఐపీఎల్ మీద పాక్ మాజీ క్రికెటర్ లతీఫ్ తన అక్కసును వెళ్లగక్కినట్టయింది.
కేంద్రంలో మోదీ సర్కారు కొలువు దీరిన తర్వాత పాక్ తో ద్వైపాక్షిక క్రికెట్ కు నూకలు చెల్లడం తెలిసిందే. దీంతో ఐపీఎల్ లో ఆడే అవకాశాన్ని పాక్ క్రికెటర్లు కోల్పోయారు. దీంతో వారు వీలైనప్పుడల్లా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఇస్తే ఐపీఎల్ వేలంలోకి ఎగిరి గంతేయడానికి పాక్ క్రికెటర్లు సిద్ధంగా ఉంటారని వేరే చెప్పక్కర్లేదు.