Tata Nexon: ముంబైలో టాటా నెక్సాన్ ఈవీలో మంటలు

Tata Nexon EV catches fire in Mumbai

  • వెస్ట్ వాసాయ్ లోని ఓ రెస్టారెంట్ ముందు ప్రమాదం
  • మంటలకు దెబ్బతిన్న కారు
  • కారణాలపై టాటా మోటార్స్ దర్యాప్తు
  • ప్రమాదాలు సహజమేనన్న ఓలా సీఈవో

ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి కారులో ఉన్నట్టుండి మంటలు లేచాయి. మంటలను ఆర్పేసరికే అది బాగా దెబ్బతిన్నది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వేసవి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీల కారణంగా అగ్ని ప్రమాదాలకు గురి కావడం తెలిసిందే. ఓలా, ప్యూర్ఈవీ సహా పలు కంపెనీలు ద్విచక్ర వాహనాలు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్ ఈవీ ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఈ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాటిల్లో ముందుంటుంది. ముంబైలోని వెస్ట్ వాసాయ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ముందు నిలిపిన నెక్సాన్ ఈవీలో మంటలు లేవగా.. ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలియలేదు. 

నెక్సాన్ ఈవీ ప్రమాదంపై విచారణ నిర్వహిస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామని, పూర్తయిన తర్వాత ప్రకటన చేస్తామని తెలిపింది. ఓలా టూ వీలర్లు కూడా గతంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేశారు. 

ఈవీ ప్రమాదాలు అసాధారణమేమీ కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ వాహనాలతో పోలిస్తే ఈవీలే సురక్షితమైనవని ప్రకటించారు. ‘‘ఈవీ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ ఇవి జరుగుతాయి. కానీ, ఈవీల్లో అగ్ని ప్రమాదాలు అన్నవి ఐసీఈ అగ్ని ప్రమాదాల కంటే తక్కువ’’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News