Nallari KIran Kumar Reddy: కలికిరి దాకా వెళ్లి... సొంతూరు ముఖం చూడని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
- కలికిరి మండల పరిధిలోనే నల్లారి సొంతూరు
- కుమారుడితో కలిసి కలికిరి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
- త్వరలోనే వస్తానని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పిన మాజీ సీఎం
- తిరుగు ప్రయాణంలో మాజీ ఎమ్మెల్సీ నరేశ్కుమార్రెడ్డికి పరామర్శ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తన సొంత జిల్లా చిత్తూరు వచ్చారు. జిల్లాలోని తన సొంతూరు నగిరిపల్లికి వెళ్లని ఆయన... నగిరిపల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న కలికిరిలోనే చాలా సేపు ఉండి తిరుగు ప్రయాణమయ్యారు. కలికిరి మండల పరిధిలోనే నగిరిపల్లి ఉంది. తన సొంతూళ్లో ఇటీవలే కొంత భూమి కొనుగోలు చేసిన కిరణ్.. దాని రిజిస్ట్రేషన్ నిమిత్తమే కలికిరి వచ్చారని సమాచారం. కుమారుడు నిఖిలేశ్కుమార్రెడ్డిని వెంటబెట్టుకుని వచ్చిన కిరణ్.. కలికిరి నుంచే హైదరాబాద్కు వెళ్లిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ఆయన సన్నిహితులు, పలువురు కాంగ్రెస్ నేతలు కలికిరి వచ్చి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడితో కలిసి చాలా మంది సెల్ఫీలు తీసుకున్నారు. తనను చూడటానికి వచ్చిన వారితో కిరణ్ కుమార్ రెడ్డి కాసేపు మాట్లాడారు. త్వరలోనే వస్తానని, అందరినీ కలుస్తానని, అందరికీ అందుబాటులోనే ఉంటానని, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఆయన వారితో చెప్పారు. రిజిస్ట్రేషన్ పనులు ముగిశాక బెంగళూరు మీదుగా ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. మార్గమధ్యంలో మదనపల్లిలో ఇటీవలే ప్రమాదంలో గాయపడ్డ మాజీ ఎమ్మెల్సీ నరేశ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు.