Hero Moto Corp: మారుతి బాటలోనే హీరో!... బైకులు, స్కూటర్ల ధరల పెంపు!
- ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల ధరలు పెరిగాయన్న హీరో
- ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగిందని వెల్లడి
- ఒక్కో బైక్‌పై రూ.3 వేల వరకు ధరలు పెరగవచ్చంటూ ప్రకటన
- ఇటీవలే ఇదే కారణం చూపి కార్ల ధరలను పెంచిన మారుతి సుజుకి
వాహన కొలుగోలుదారులపై ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ మరింత భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతూ ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఒక్కో బైక్‌పై రూ.3 వేల వరకు ఉంటుందని ఆ కంపెనీ వెల్లడించింది. ధరల పెంపునకు పెరిగిన ఉత్పత్తి వ్యయమే కారణమని కూడా కంపెనీ తెలిపింది.
పెంచిన ధరలు జులై 1 నుంచి అమలులోకి రానున్నట్లు హీరో మోటో కార్ప్ వెల్లడించింది. అయితే ఏ బైక్‌పై ఎంతమేర పెంచుతున్నామన్న వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల ధరలు పెరిగాయని, ఫలితంగానే ఉత్పత్తి వ్యయం పెరిగిందని ఆ కంపెనీ తెలిపింది. ఇదే కారణం చెప్పి ఇటీవలే మారుతి సుజుకి కూడా తన కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో మోటో కార్ప్ కూడా అదే బాటలో సాగడంతో మిగిలిన వాహన తయారీ సంస్థలు కూడా తమ బైకులు, కార్ల ధరలను పెంచే దిశగా నిర్ణయం తీసుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.