YSRCP: ఏబీఎన్, టీవీ5లపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
- ఈ ఛానెళ్ల ఎడిటర్లు, జర్నలిస్టులు నైతిక విలువలను మరిచారని ఆరోపణ
- దక్షిణ భారతంలో ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తున్నాయన్న ఎంపీ
- వెంకయ్యకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం దక్కని కారణంగానే దుష్ప్రచారమని ఆరోపణ
- పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టి ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని వినతి
- ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోట్ చేస్తూ సాయిరెడ్డి ట్వీట్లు
తెలుగు న్యూస్ ఛానెళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా గురువారం రాత్రి ఆసక్తికర పోస్టులు పెట్టారు. ఈ రెండు ఛానెళ్ల ఎడిటర్లు, జర్నలిస్టులు నైతిక విలువలను మరిచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడాన్ని ఆసరా చేసుకుని దక్షిణ భారత దేశంలో ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ తరహా చర్యలు ముమ్మాటికీ దేశ ద్రోహం కిందకే వస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ తరహా ప్రచారం ద్వారా ఈ రెండు ఛానెళ్ల ఎడిటర్లు, జర్నలిస్టులు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వీరిపై తగిన రీతిలో చర్యలు తీసుకునేలా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టేలా ప్రెస్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సాయిరెడ్డి హిందీలో పెట్టిన పోస్టులు సంచలనంగా మారిపోయాయి.