Chittoor: చిత్తూరులో అర్ధరాత్రి 'గంజాయి' కలకలం.. పోలీసుల సోదాలు.. ఆసుపత్రిలో మాజీ మేయర్ హేమలత
- గంజాయి ఉందంటూ హేమలత అనుచరుడు పూర్ణ ఇంట్లో పోలీసుల సోదాలు
- విషయం తెలిసి ఆందోళనకు దిగిన హేమలత
- కావాలనే జీపు ఎక్కించారంటున్న అనుచరులు
- కాళ్లలో స్వల్పంగా పగుళ్లు వచ్చాయన్న వైద్యులు
- కడుపులో నొప్పి కూడా వస్తుండడంతో వేలూరు తరలించే అవకాశం
చిత్తూరు మాజీ మేయర్, టీడీపీ నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటిలో గత అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు లోపల గంజాయి ఉందని చెప్పి సోదాలు చేశారు. దీంతో పూర్ణ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తన ఇంట్లో గంజాయి ఎందుకు ఉంటుందని, తప్పుడు కేసుల్లో ఇరికించేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన హేమలత.. పూర్ణ ఇంటికి వచ్చారు. అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనక బైఠాయించారు.
ఆమె ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసు జీపు వెనక్కి రావడంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయని అనుచరులు ఆరోపిస్తున్నారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హేమలత కాళ్లపై నుంచి జీపు ఎక్కించినట్టు వస్తున్న ఆరోపణలను చిత్తూరు టూటౌన్ సీఐ యతీంద్ర కొట్టిపడేశారు. టీడీపీ నేతలే జీపునకు అడ్డుగా ఉన్నారని, వారికి వాహనం తగలకపోయినా ఎక్కించామని చెబుతున్నారని పేర్కొన్నారు.
తన అత్తమామలైన దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ ఏఎస్పీ జగదీష్‌కు నిన్న సాయంత్రం హేమలత ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాతే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షిగా ఉన్న హేమలత అనుచరుడైన ప్రసన్న తమ్ముడు పూర్ణ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నాడంటూ గత రాత్రి 8 గంటల సమయంలో టూటూన్ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న టీడీపీ నేతలు పోలీసులు స్టేషన్‌కు వెళ్లి ఆధారాలు చూపించాలని అడగడంతో, ప్రసన్నను సంతపేటలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో పోలీసులు తమ ఇంట్లో గంజాయి బస్తాలు పెట్టేందుకు ప్రయత్నించడంతో తాము అడ్డుకున్నామని పూర్ణ తల్లి, వదిన ఆరోపించారు. ఇక్కడ తాము అడ్డుకోవడంతో ఓబనపల్లెలో తమకున్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న హేమలత వచ్చి ఆందోళనకు దిగారు. ఆ బస్తాల్లో ఏముందో చూపించాలని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన పోలీసులు పూర్ణను మళ్లీ జీపు ఎక్కించారు. దీంతో హేమలత ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె రెండు కాళ్లలో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. హేమలతకు కడుపులో నొప్పిగా ఉండడంతో ఆమెను వేలూరు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.