Adithya Thackeray: అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి వచ్చి మీడియా ప్రతినిధుల అన్నపానీయాలపై వాకబు చేసిన ఆదిత్య థాకరే
- మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం
- నిలువునా చీలిన శివసేన
- మంత్రి ఏక్ నాథ్ షిండే క్యాంపు రాజకీయాలు
- అధికార నివాసాన్ని వీడిన సీఎం ఉద్ధవ్ థాకరే
మంత్రి ఏక్ నాథ్ షిండే కారణంగా అనూహ్యరీతిలో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షిండే... సీఎం ఉద్ధవ్ థాకరే పీఠానికి ఎసరుపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాకరే అధికారిక నివాసం 'వర్ష'ను వీడి సొంత ఇల్లు 'మాతోశ్రీ'కి తరలి వెళ్లారు.
ఈ నేపథ్యంలో, ఉద్ధవ్ థాకరే తనయుడు, మంత్రి ఆదిత్య థాకరే అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటికి వచ్చారు. వర్షంలోనూ అక్కడే వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులతో సాదరంగా మాట్లాడారు. అంత రాత్రి వేళ కూడా వారు అక్కడే ఉండడం పట్ల స్పందిస్తూ, భోజనం చేశారా? అంటూ ఆ జర్నలిస్టుల అన్నపానీయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అయితే, మీడియా ప్రతినిధులు ప్రస్తుత పరిణామాలపై వివరాలు చెప్పాలని కోరగా, తాను ఎలాంటి ప్రకటన చేయలేనని స్పష్టం చేశారు. కొవిడ్ పాజిటివ్ గా వెల్లడైన సీఎం ఉద్ధవ్ థాకరే ఆరోగ్యం బాగానే ఉందని ఆదిత్య వెల్లడించారు.
అటు, రెబల్ నేత ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 42కి పెరిగింది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో శివసేన పొత్తు అనైతికమని, బీజేపీతో శివసేన తన పాత పొత్తును పునరుద్ధరించుకోవాలని షిండే వర్గం డిమాండ్ చేస్తోంది.