Uddhav Thackeray: పార్టీ కోసం ప్రాణాలిస్తామన్న వారే పారిపోయారు.. నేనెందుకు బాధపడాలి?: ఉద్ధవ్ థాకరే
- వారు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్న ఉద్ధవ్
- శివసేన, థాకరే పేరు లేకుండా ఎంత దూరం వెళ్లగలరని ప్రశ్న
- వర్చువల్ సమావేశంలో పార్టీ నేతలతో శివసేన చీఫ్ వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే వెనుక చేరిన ఎమ్మెల్యేలపై శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. పార్టీ నేతలతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
“వారు పార్టీని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామని ప్రమాణాలు చేసినవారే ఇప్పుడు పారిపోయి పార్టీని దెబ్బతీస్తున్నారు. శివసేన, థాకరేల పేర్లు వాడకుండా వారెంత దూరం వెళ్లగలరు?” అని ఆయన ప్రశ్నించారు.
నా కుమారుడిపై అక్కసు ఎందుకు?
ఏక్ నాథ్ షిండే, ఇతర ఎమ్మెల్యేలు తమ తిరుగుబాటుకు కారణాల్లో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరేనూ కారణంగా చూపుతుండటం, ఆదిత్య మరో అధికార కేంద్రంగా మారాడని ఆరోపిస్తుండటంపై ఉద్ధవ్ మండిపడ్డారు.
‘‘ఏక్ నాథ్ షిండే కుమారుడు ఎంపీగా ఉన్నారు. అలాంటప్పుడు నా కుమారుడి విషయంలో వారికి ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. నేను ఇక కోలుకోలేనని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను” అని ఆయన పేర్కొన్నారు.