Sunil Gavaskar: ఇంగ్లండ్ తో ఏకైక టెస్టుకు, వన్డేలకు ఉమ్రాన్ మాలిక్ ను తీసుకెళ్లండి: గవాస్కర్
- జులై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
- ఉమ్రాన్ ను ఎంపిక చేయాలంటున్న గవాస్కర్
- అతడిలో స్ఫూర్తి నింపాలని సూచన
ఇటీవల ముగిసిన ఐపీఎల్ పోటీల్లో సన్ రైజర్స్ తరపున సంచలన ప్రదర్శన చేసిన జమ్మూ కశ్మీర్ సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక చేయాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ తో ఏకైక టెస్టుకు ఉమ్రాన్ మాలిక్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అతడిని తుది జట్టులోకి చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.
ఇంగ్లండ్ తో ఒకే ఒక్క టెస్టు ఆడే భారత జట్టులో షమీ, బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లు ఉన్నందున ఉమ్రాన్ మాలిక్ కు తుదిజట్టులో స్థానం లభించకపోవచ్చని తెలిపారు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవడం వల్ల ఉమ్రాన్ మాలిక్ లో ఎంత మార్పు వస్తుందో చూడండి అంటూ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. అతడు తప్పకుండా స్ఫూర్తిని పొందుతాడని వివరించారు.
22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 15వ సీజన్ లో తన వేగంతో ప్రకంపనలు సృష్టించాడు. మొత్తం 14 మ్యాచ్ లు ఆడి 22 వికెట్లు తీశాడు. ముఖ్యంగా, అతడి బంతుల్లో వేగం క్రికెట్ పండితులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రతిమ్యాచ్ లోనూ నిలకడగా 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులు విసిరి తన సత్తా చాటాడు. ఓ మ్యాచ్ లో అతడు విసిరిన బంతి గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ ను టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. త్వరలో ఐర్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు కూడా ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు ఎంపికయ్యాడు. మరి ఈ సిరీస్ ద్వారా అయినా అతడు అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి.