Mukesh Ambani: వరద విలయంలో అసోం... రూ.25 కోట్లు అందించిన ముఖేశ్ అంబానీ
- అసోంలో ఎడతెరిపి లేని వర్షాలు
- వరదల్లో చిక్కుకున్న మెజారిటీ ప్రాంతాలు
- అసోం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 కోట్లు ఇచ్చిన ముఖేశ్, అనంత్ అంబానీలు
- ధన్యవాదాలు తెలుపుతూ అసోం సీఎం ట్వీట్
ఎడతెరిపి లేని వర్షాలతో అసోంలో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అసోం ప్రభుత్వం శాయశక్తులా శ్రమిస్తోంది. అదే సమయంలో వరద సహాయక శిబిరాలకు చేరిన ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసరాలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అసోం ప్రభుత్వం అడగకుండానే దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీలు ఏకంగా రూ.25 కోట్లను అసోం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. ఈ సాయాన్ని కొనియాడుతూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ముఖేశ్, అనంత్‌ల సాయానికి రుణపడి ఉన్నామని, కష్టకాలంలో ఆదుకున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ సదరు ట్వీట్లో హిమంత పేర్కొన్నారు.