Shiv Sena: గుర్తుతెలియని ఈమెయిల్ నుంచి వచ్చిందంటూ.. తనపై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్!

sent from anonymous email motion against deputy speaker rejected

  • అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రయత్నం
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లపై అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉంటే అనర్హత నిర్ణయం తీసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై మంత్రి ఏక్‌ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పంపిన అవిశ్వాస తీర్మానాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తిరస్కరించారు. 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినా.. ప్రత్యక్షంగా ఎవరూ దానిని డిప్యూటీ స్పీకర్  కార్యాలయంలో సమర్పించలేదు. 

కేవలం జూన్ 22 న ఉదయం 11:30 గంటలకు ఒక అనామక ఈ మెయిల్ ఐడీ నుంచి ఒక మెయిల్ మాత్రమే పంపారని.. ఆ ఈ-మెయిల్ సాధికారతను నిరూపించలేకపోవడం, సరైన కమ్యూనికేషన్ లోపించడంతో.. ఆ తీర్మానాన్ని తిరస్కరించినట్టు డిప్యూటీ స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

తీర్మానంపై సంతకం చేసిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వచ్చి సమర్పించే వరకు.. ఆ తీర్మానం సాధికారతను నిర్ధారించుకునే వరకు.. దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ నిర్ణయించినట్టు తెలిపాయి.

రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండానే..

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లపై అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉంటే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు శివసేన సంకీర్ణ సర్కారు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. కానీ అది సరైన రీతిలో అందలేదంటూ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.

  • Loading...

More Telugu News