AP High Court: చెప్పిన రోజు విచారణకు హాజరు కావాల్సిందే!... ఆమంచికి తేల్చి చెప్పిన సీబీఐ!
- న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- ఇప్పటికే ఆమంచికి నోటీసులు జారీ చేసిన సీబీఐ
- వారం పాటు గడువు ఇవ్వాలన్న వైసీపీ నేత
- తాజాగా ఆమంచికి మరోమారు సీబీఐ నోటీసులు
- బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిలిపించి మరీ నోటీసుల అందజేత
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు శనివారం సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేశారు. శనివారం బాపట్లలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఆమంచిని పిలిపించి మరీ అక్కడే ఆయనకు తాజా నోటీసులు జారీ చేశారు. తాము సూచించిన రోజే విచారణకు హాజరు కావాలని ఆయనకు సదరు నోటీసుల్లో సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో వైసీపీకి చెందిన పలువురు నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు... సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా ఆమంచిని సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 21న విచారణకు రావాలంటూ ఆమంచికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే 21న విచారణకు హాజరు కాలేనని, ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఆమంచి సీబీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం బాపట్ల ఎస్పీ కార్యాలయానికి ఆమంచిని పిలిపించి మరీ సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేశారు.