Telangana: ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ ఒప్పందం.. అన్లైన్లో లభించనున్న డ్వాక్రా ఉత్పత్తులు
- మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో కుదరిన ఒప్పందం
- తొలి ఏడాదే రూ.500 కోట్ల మేర విక్రయాలే లక్ష్యం
- ఫ్లిప్ కార్ట్ ఒప్పందంతో డ్వాక్రా మహిళలకు భారీ లాభమన్న మంత్రి
తెలంగాణకు చెందిన స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలు రూపొందించే ఉత్పత్తులను ఆన్లైన్లో వినియోగదారులకు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఓ కీలక అడుగు వేసింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సర్కారు ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఒప్పందంపై సెర్ప్ సీఈఓ, ఫ్లిప్ కార్ట్ ఉపాధ్యక్షురాలు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ తరహా ఒప్పందాల్లో దేశంలోనే ఇది మొదటిదని చెప్పారు. ఒప్పందం కుదిరిన తొలి ఏడాదిలోనే రూ.500 కోట్ల మేర విలువైన డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులకు విక్రయించనుందని ఆయన తెలిపారు. ఫ్లిప్ కార్ట్ చేపట్టిన ఏ కార్యక్రమం కూడా విఫలం కాలేదన్న మంత్రి... ఈ ఒప్పందంతో తెలంగాణ డ్వాక్రా మహిళలకు కూడా భారీ లబ్ధి చేకూరనుందని తెలిపారు.