Joe Biden: అమెరికాలో తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించే బిల్లుపై సంతకం చేసిన బైడెన్

Biden signs on key bill to restrict gun culture

  • అమెరికాలో విశృంఖలంగా తుపాకీ కాల్పుల ఘటనలు
  • ఇటీవల టెక్సాస్ లో ఘోరం
  • 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల మృతి
  • బిల్లుకు చట్టసభల ఆమోదం
  • ఇక ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న బైడెన్

అమెరికాలో ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనలు అధికంగా చోటుచేసుకున్నాయి. కొన్నిరోజుల కిందట టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు బలయ్యారు. దాంతో తుపాకీ సంస్కృతిపై అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. 

దశాబ్దాల తరబడి విస్తృతమైన తుపాకీ హింస నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని బైడెన్ భావిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లభిస్తుందని తుపాకీ కాల్పుల బాధితులను ఉద్దేశించి వైట్ హౌస్ లో బైడెన్ వ్యాఖ్యానించారు. బాధితుల వేదన తమను ఏదో ఒకటి చేయాలన్న దిశగా నడిపించిందని, ఇవాళ ఆ పని పూర్తి చేశామని వెల్లడించారు. ఈ బిల్లుకు గురువారం సెనేట్ లో ఆమోదం లభించగా, ప్రతినిధుల సభలో శుక్రవారం మోక్షం కలిగింది. యూరప్ లో రెండ్రోజుల పర్యటనకు వెళ్లేముందు బైడెన్ ఈ బిల్లును సమీక్షించి సంతకం చేశారు. 

ఈ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తే... బాలలు తుపాకులు కొనుగోలు చేయడంపై నిశితంగా దృష్టిసారించేందుకు వీలు కల్పిస్తుంది. పిన్న వయసు తుపాకీ కొనుగోలుదార్ల నేపథ్యం గురించిన తనిఖీలు మరింత కఠినతరం చేయడం ఈ బిల్లుతో సాధ్యమవుతుంది. అంతేకాదు, ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించిన వారి నుంచి తుపాకులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. అంతేకాదు, గృహ హింస నేరాలకు పాల్పడిన వారు ఇకపై తుపాకులు పొందడం కష్టసాధ్యంగా మారనుంది. ఈ మేరకు కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది.

  • Loading...

More Telugu News