Telangana: టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసిన తెలంగాణ సర్కారు
- ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడికి మధ్యాహ్నం ఉత్తర్వులు
- రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి నిరసనలు
- ఉత్తర్వులపై ధ్వజమెత్తిన విపక్షాలు
- ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా క్రమం తప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయంపై టీఆర్ఎస్ సర్కారు వెనకడుగు వేసింది. ఈ అంశంపై అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వులను గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి సదరు ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
ఏటా తమ ఆస్తులను ప్రభుత్వ ఉపాధ్యాయులు వెల్లడించాలని ఆదేశిస్తూ శనివారం మధ్యాహ్నం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు కూడా ముందుగా అనుమతి తీసుకోవాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఉత్తర్వులపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉపాధ్యాయులతో పాటు విపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డాయి. ముందుగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తుల వెల్లడికి ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన టీఆర్ఎస్ సర్కారు సదరు ఉత్తర్వులను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.