Asaduddin Owaisi: మహారాష్ట్ర రాజకీయాలను 'కోతులాట'తో పోల్చిన అసదుద్దీన్ ఒవైసీ
- శివసేనలో ఒక్కసారిగా చీలిక
- రెబెల్ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్న ఏక్ నాథ్ షిండే
- శివసేన అంతర్గత వ్యవహారమన్న అసదుద్దీన్
మహారాష్ట్రలో శివసేన పార్టీ సంక్షోభం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. గువాహటిలోని తమ గదుల బుకింగ్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని రెబెల్ ఎమ్మెల్యేలు హోటల్ నిర్వాహకులను కోరారన్న వార్తల నేపథ్యంలో, ఈ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేట్టు కనిపించడంలేదు. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే 'కోతులాట'ను తలపిస్తోందని ఒవైసీ వ్యాఖ్యానించారు. కోతుల్లా ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.
"ఈ సంక్షోభంపై మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేయనివ్వండి. మేమైతే మహారాష్ట్ర పరిణామాలపై ఓ కన్నేసి ఉంచాం" అని ఒవైసీ వివరించారు. ఇది శివసేన పార్టీ అంతర్గత వ్యవహారమని, తాను కానీ, తన పార్టీ కానీ ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.