Droupadi Murmu: ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
- ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
- పాండవులు, కౌరవులు ఎక్కడన్న వర్మ
- బీజేపీ నేతల ఆగ్రహం
- పోలీసులకు ఫిర్యాదు
- కించపరిచే ఉద్దేశం లేదన్న వర్మ
దేశంలో తొలిసారిగా ద్రౌపది ముర్ము రూపంలో ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి ఎన్నికల రేసులో నిలిచారు. ఆమె ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. ఆమెపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
"ద్రౌపది సరే... పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు?" అంటూ తనదైన శైలిలో స్పందించారు. దాంతో భగ్గుమన్న బీజేపీ నేతలు వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చిన వర్మ... మరోసారి ద్రౌపది ముర్ము కేంద్రబిందువుగా ఇప్పుడు ట్విట్టర్ లో స్పందించారు.
అత్యంత గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాబోతున్న అపురూపమైన తరుణంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధం గురించి మర్చిపోయి ఆమెను ఆరాధిస్తారని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు, నవ్య భారతదేశంలో మహాభారతం పునర్ లిఖించబడుతుందని, భారత్ ను చూసి ప్రపంచం గర్విస్తుందని వివరించారు. చివరగా "జై బీజేపీ" అంటూ తన ట్వీట్ ను ముగించారు.