Machilipatnam: మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం.. ఐదు రోజులుగా కనిపించని జాడ
- బదిలీపై ఈ నెల 16న బందరుకు
- 20వ తేదీ వరకు విధులకు హాజరు
- అదే రోజు స్నేహితుడి బైక్ తీసుకుని వెళ్లిన సీఐ
- కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు
మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన జాడ లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో పనిచేస్తున్న బాలరాజాజీ ఈ నెల 16న ట్రాఫిక్ సీఐగా బదిలీపై మచిలీపట్నం వచ్చారు. 20వ తేదీ వరకు విధులకు హాజరయ్యారు. అదే రోజున స్నేహితుడి బైక్పై బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఐదు రోజులుగా ఆయన జాడ లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
బాలరాజాజీ ఏలూరు సీఐగా ఉన్న సమయంలో ఓ యువతిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. గత కొంతకాలంగా వీఆర్లో ఉన్న ఆయన వేరే జిల్లాకు బదిలీ చేయమని కోరడంతో విజయవాడకు పంపారు. అక్కడి నుంచి ఇటీవలే మచిలీపట్నానికి బదిలీ అయ్యారు. దీంతో కుటుంబంతో సహా మచిలీపట్నానికి చేరుకున్న బాలరాజాజీ అంతలోనే అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆయన అదృశ్యానికి కుటుంబ కలహాలు కారణం అయి ఉండొచ్చన్న అనుమానంతో ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు బందరు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. ఇంట్లో గొడవల నేపథ్యంలో మానసిక ప్రశాంతత కోసం ఆయన ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చని, ప్రాథమిక విచారణలోనూ అదే తేలిందని ఆయన పేర్కొన్నారు.