TRS: మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే హర్షవర్దన్... కొల్లాపూర్‌లో ఉద్రిక్తత
- కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు
- నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చకు సవాల్
- అంబేద్కర్ చౌరస్తాలో చర్చిద్దామన్న జూపల్లి
- జూపల్లి ఇంటికే వస్తానన్న ఎమ్మెల్యే హర్షవర్దన్
- ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరింపు
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య కొన్నాళ్ల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్ చాలెంజ్ చేస్తూ ..బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసిరారు. అయితే, చర్చకు జూపల్లి ఇంటికే వస్తానని ఎమ్మెల్యే హర్షవర్దన్ ప్రతిసవాల్ విసిరారు. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ కొల్లాపూర్ చేరుకున్నారు.
దాంతో, కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. జూపల్లి ఇంటి వద్దకు వచ్చిన ఆయన అనుచరులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు. ఎమ్మెల్యే హర్షవర్దన్ తన ఇంటికి వస్తానన్నారని, అందుకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి అన్నారు.