Ukraine: కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఒక్క రోజే 50 రాకెట్లు ప్రయోగించిన పుతిన్ సేనలు
- చెర్నిహీవ్‌పై 20, జైటోమిర్ రీజియన్‌పై 30 రాకెట్ల ప్రయోగం
- యారోవ్ మిలటరీ బేస్‌పై రాకెట్ల వర్షం
- రష్యా చేతుల్లోకి లుహాన్స్క్ ప్రావిన్స్
రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రతరమవుతోంది. రష్యా దురాక్రమణను నిలువరిస్తున్న ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. నిన్న ఒక్క రోజే 50పైకి క్షిపణులను ప్రయోగించాయి. నల్ల సముద్రం నుంచి పశ్చిమాన ల్వీవ్ రీజియన్‌లో ఉన్న యారోవ్ మిలటరీ బేస్‌పై క్షిపణులను ప్రయోగించాయి. మార్చి నెలలో ఇదే బేస్‌పై రష్యా జరిపిన దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, నిన్న బెలారస్ నుంచి ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహీవ్‌పై 20, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని జైటోమిర్ రీజియన్‌పై 30 రాకెట్లను రష్యా దళాలు ప్రయోగించాయి.
కాగా, ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రావిన్స్ పూర్తిగా రష్యా చేతుల్లోకి వెళ్లనుంది. ఇక్కడ రెండుమూడు నగరాల్లో మాత్రం ఉక్రెయిన్ సేనలకు పట్టుంది. 2014 నుంచి లుహాన్స్క్‌లోని 95 శాతం, డోనెట్స్క్ ప్రావిన్స్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు నియంత్రిస్తున్నారు. ఇప్పుడు లిసిచాన్స్క్, సీవీరోడోనెట్స్క్ కూడా రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి.