Telangana: కొల్లాపూర్‌లో హైటెన్ష‌న్‌... టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌

high tension in kolhapur and trs mla harsha vardhan reddy arrested

  • మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌ధ్య విభేదాలు
  • బ‌హిరంగ చ‌ర్చ‌కు ఇద్ద‌రు నేత‌ల స‌వాళ్లు
  • అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద‌కు చ‌ర్చ‌కు బ‌య‌లుదేరిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌
  • ఇంటి వ‌ద్దే ఆయ‌న‌ను అడ్డుకున్న పోలీసులు
  • అరెస్ట్ చేసి పెద్ద‌కొత్తప‌ల్లికి త‌ర‌లింపు

తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ఉద‌యం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాద‌మే ఇందుకు కార‌ణంగా నిలిచింది. 2014లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూప‌ల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2018 ఎన్నిక‌ల్లో జూప‌ల్లి ఓటమిపాల‌య్యారు. జూప‌ల్లిని ఓడించిన కాంగ్రెస్ అభ్య‌ర్థి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు ఒక‌రిపై మ‌రొకరు శ‌నివారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధ‌మంటూ ఇద్ద‌రు నేత‌లు స‌వాళ్లు విసురుకున్నారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద జూప‌ల్లితో చ‌ర్చ‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అప్ప‌టికే ఆయ‌న ఇంటికి ఆయ‌న అనుచ‌రులు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ప‌రిస్థితి చేజారిపోతోంద‌ని గ్ర‌హించిన పోలీసులు... చ‌ర్చ‌కు వెళ్లేందుకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు అనుమ‌తి నిరాక‌రించారు.

అయినా కూడా విన‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చ‌ర్చ‌కు వెళ్లి తీర‌తానంటూ భీష్మించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ వాహ‌నంలోకి ఎక్కించారు. అయితే అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అనుచ‌రులు వాహ‌నాన్ని క‌ద‌ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆ త‌ర్వాత ఎలాగోలా కారును అక్క‌డి నుంచి క‌దిలించిన పోలీసులు... హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను పెద్ద‌కొత్త‌ప‌ల్లికి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News