Polygons: అంగారకుడిపై ఈ డబ్బాలు గీసిందెవరు?
- విశాలమైన ప్రాంతంలో చతురస్రాకారపు గుర్తులు
- మార్స్ చుట్టూ తిరుగుతున్న హైరైజ్ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో గుర్తింపు
- ఉపరితలం దిగువన ఉన్న మంచు దీనికి కారణమని అంచనా
యధాప్రకారం అంగారకుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న మార్స్ రీకన్నేసన్స్ ఆర్బిటర్ ఉపగ్రహం ఇటీవల చిత్రమైన ఆకారాలను గుర్తించింది. అంగారకుడి ఉపరితలంపై సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యంలో చతురస్రాకారపు గుర్తులు, అక్కడక్కడా నలుపు, నీలం రంగు విసిరేసినట్టుగా ఉన్న ఆకృతులను ‘హై రిజల్యూషన్ ఇమేజింగ్ ఎక్స్ పెరిమెంట్ (హైరైజ్)’ కెమెరాతో చిత్రీకరించింది. అది చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అదేమిటో తేల్చేందుకు క్షుణ్నంగా పరిశీలించారు.
మంచు ఒక్కసారిగా ఆవిరై..
అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో మట్టి పొరల కింద మంచు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందు పలు పరిశోధనల్లో గుర్తించారు. అయితే మన భూమిలాగే అంగారకుడిపైనా శీతాకాలం, ఎండాకాలం రుతువులు వస్తాయి. అతి శీతల పరిస్థితులు ఉండే సమయంలో ఉపరితలం కింద ఉండిపోయిన మంచు.. వేసవి రాగానే ఒక్కసారిగా నేరుగా ఆవిరై పైకి ఎగజిమ్మి ఉంటుందని తేల్చారు. ఆ సమయంలో ఏర్పడ్డ పగుళ్లు చతురస్రం, ఇతర ఆకారాల్లో కనిపిస్తున్నాయని గుర్తించారు. ఇక నీటి ఆవిరి ఎగజిమ్మినప్పుడు ఉపరితలంపై మట్టి కూడా ఎగసిపడి నలుపు, నీలం రంగు ఆకృతులు ఏర్పడ్డాయని అంచనా వేశారు.