Narendra Modi: జగన్నాధుడు మనకు లోతైన మానవ సందేశాలను అందిస్తాడు : ప్రధాని మోదీ
- మన్ కీ బాత్ ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు
- దేవుడు ఈ జగత్తుకు అధిపతి అని వెల్లడి
- దేవుడి కోసం యాత్రల్లో పేదలు ప్రత్యేక భాగస్వాములని వివరణ
- యాత్రలతో ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందన్న ప్రధాని
ప్రధాన నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేవుడు ఈ జగత్తుకు అధిపతి అని, దేవుడి కోసం జరిపే యాత్రల్లో పేదలు ప్రత్యేక భాగస్వామ్యం కలిగి ఉన్నారని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా దేవుడు ప్రత్యేకమేనని అన్నారు. అహ్మదాబాద్ అయినా, పూరీ క్షేత్రం అయినా జగన్నాథుడు మనకు లోతైన మానవ సందేశాలను అందిస్తాడని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేవుడి ప్రయాణంలో పేద, ధనిక, ఉన్నత, తక్కువ అనే తారతమ్యం లేదని, అది అన్ని వివక్షలకు మించినదని వివరించారు.
దక్షిణాదిలో శబరిమల యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. శబరిమల కొండల్లో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దట్టమైన అటవీమార్గంలో ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి యాత్రలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందని పేర్కొన్నారు.
జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుందని, ఈ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కశ్మీర్ చేరుకుంటారని మోదీ వివరించారు.