Shiv Sena: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్​’ సెక్యూరిటీ

Centre arrange Y Plus security for Shiv Sena rebel MLAs

  • శివ సైనికుల ఆందోళనలతో కేంద్రం నిర్ణయం
  • మహారాష్ట్రలో వారి కుటుంబాలకూ భద్రత
  • రెబెల్ ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ శివసేన కార్యకర్తల ఆందోళనలు
  • వెనక్కి వచ్చే ఆలోచనలో 20 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు!

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీనితో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్ ‘వై ప్లస్’ సాయుధ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఎమ్మెల్యేలతోపాటు మహారాష్ట్రలోని వారి కుటుంబాలకు కూడా భద్రత కల్పించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వై ప్లస్ కేటగిరీ కింద మొత్తంగా 39 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తారు. మూడు షిఫ్టుల్లో ఎప్పుడూ ఇద్దరి నుంచి నలుగురు సాయుధ కమెండోలు, 11 మంది పోలీసు సిబ్బంది కాపలా కాస్తుంటారు. రెండు, మూడు భద్రతా వాహనాలతో ముందూ వెనకా కాన్వాయ్ ఉంటుంది.

భారీగా ఆందోళనలు..
తిరుగుబాటు ఎమ్మెల్యేలను తప్పుపడుతూ శివసేన కార్యకర్తలు ఆదివారం మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలకు దిగారు. భారీగా బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు. నమ్మకద్రోహం చేసిన ఎమ్మెల్యేలను క్షమించేది లేదంటూ నినాదాలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అస్సాంలోని గౌహతిలోనే ఉండాలని రెబెల్‌ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 

20 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి!
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో సుమారు 20 మంది తిరిగి వెనక్కి వస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ 20 మంది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడుతున్నారని సమాచారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీలో విలీనానికి వ్యతిరేకంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News