Ahmed Shehzad: దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
- పాక్ జట్టులో స్థానం కోల్పోయిన షేజాద్
- రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే జట్టు నుంచి తప్పించారని వెల్లడి
- దేశవాళీల్లో రాణించినా చోటివ్వలేదని ఆరోపణ
పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షేజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో ధోనీ ఉండడం వల్ల కోహ్లీ విజయవంతం అయ్యాడని, దురదృష్టవశాత్తు తమ దేశంలో ధోనీ వంటి వాళ్లు లేరని అన్నాడు. ఎవరైనా బాగా ఆడితే తమ మాజీ ఆటగాళ్లు ఓర్వలేరని విమర్శించాడు. కోహ్లీ రెండేళ్లుగా రాణించకపోయినా, భారత్ లో అతడికి ప్రోత్సాహం అందిస్తున్నారని, తాను ఒకట్రెండు మ్యాచ్ ల్లో సరిగా ఆడకపోయేసరికి తనను జట్టు నుంచి తప్పించారని షేజాద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
జాతీయ జట్టులో స్థానం కోల్పోయాక దేశవాళీ క్రికెట్ ఆడమన్నారని, తాను విశేషంగా రాణించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచినా మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదని షేజాద్ ఆరోపించాడు. కోహ్లీ వంటి ఆటగాళ్లకు ధోనీ ఎంతగానో మద్దతు ఇచ్చేవాడని, కానీ పాకిస్థాన్ లో అలాంటి పరిస్థితి లేదని తెలిపాడు.