Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’కు దరఖాస్తుల వెల్లువ.. వాయుసేనకు మూడు రోజుల్లో 60 వేల మంది దరఖాస్తు

Nearly 60 thousand applications in three days for agnipath
  • జులై 5న ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ
  • డిసెంబరు 11న అగ్నివీర్ తొలి బ్యాచ్ ప్రకటన
  • అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు
‘అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59,960 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ జులై 5న ముగియనుండడంతో లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటిస్తారు.

ఈ నెల 14న కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించగా, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మకంగానూ మారాయి. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న యువత ‘అగ్నిపథ్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇక ఎంపికయ్యాక నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. అయితే, ఎంపికైన వారిలో 25 శాతం మందిని మాత్రం పూర్తిస్థాయి ఉద్యోగులుగా తిరిగి తీసుకుంటారు. వారు 15 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందిస్తారు. కాగా, ఈ ఏడాది మాత్రం 23 ఏళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Agnipath Scheme
IAF
Agniveer
Airforce

More Telugu News