Pridhvi Raj: నేను ఈ రోజు బతికి ఉన్నానంటే ఆమే కారణం: నటుడు పృథ్వీ
- ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆమె పేరును వెల్లడించిన పృథ్వీ
- 20 ఏళ్లుగా ఆమె తనను ఆదరిస్తున్నారన్న నటుడు
- జగన్తో ఉన్నప్పుడు ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ కలిగేదన్న పృథ్వీ
- వారు అర్థం చేసుకోకుంటే తాను పోయి మూడేళ్లు అయి ఉండేదన్న నటుడు
తాను ఈ రోజు బతికి ఉండడానికి కారణం ఒక మహిళ అని, 20 ఏళ్లుగా ఆమె తన బిడ్డలతో సమానంగా తనను ఆదరిస్తున్నారని టాలీవుడ్ నటుడు పృథ్వీ అన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ షో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పాల్గొన్న పృథ్వీ పలు విషయాలను నిస్సంకోచంగా వెల్లడించారు.
తాను వైసీపీలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పలుమార్లు కలిశానని, పాదయాత్రలోనూ పాల్గొన్నానని చెప్పారు. ఆ సమయంలో ఎవరెస్ట్ ఎక్కిన హిల్లరీ కంటే గొప్పవాడిననే ఫీలింగ్ కలిగిందని అన్నారు. దీంతో తన స్థాయిని మర్చిపోయి ఎంతోమందిని ఎన్నో అన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వాళ్లందరూ తనను అర్థం చేసుకున్నారని, లేదంటే పృథ్వీ వెళ్లిపోయి మూడేళ్లు అయి ఉండేదని అన్నారు.
2020 నుంచి తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, తనను పలకరించిన వాళ్లు కూడా ఎవరూ లేకుండా పోయారని అన్నారు. అయితే, హైదరాబాద్లో ఒకామె మాత్రం తనకు డబ్బులు ఇచ్చేవారని, ఇరవై ఏళ్లుగా తన బిడ్డలతో సమానంగా నన్ను ఆదరిస్తున్నారని చెప్పారు. తానీ రోజు బతికి ఉన్నానంటే ఆమే కారణమని అన్నారు. కరోనా సమయంలో కూడా ఆమె తన దగ్గర ఉన్నారని, అప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. వాటన్నింటికి 2023లో సమాధానం చెబుతానని అప్పుడు చెప్పానని, త్వరలోనే ఆమె గురించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
అప్పుడు రాధాకృష్ణ కల్పించుకుని ‘అప్పటి వరకు ఎందుకు? ఇప్పుడు సమయం వచ్చింది కదా చెప్పండి’ అనడంతో ఆమె పేరును దాసరి పద్మరేఖగా వెల్లడించారు. ఆమెది వరంగల్ అని, తర్వాత చెన్నైకి వెళ్లారని అన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పటి నుంచీ తెలుసన్నారు. చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్గానూ ఆమె చేశారన్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చేశారని వివరించారు. వాళ్ల తాతగారు కూడా తనకు తెలుసన్నారు. వాళ్లకి ఎలాంటి సమస్య వచ్చినా తాను, తనకు ఏదైనా ఇబ్బంది వస్తే వారు సాయం చేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆవిడే తన బాగోగులు చూసుకుంటున్నారని పృథ్వీ వివరించారు.