Shiv Sena: మరో పార్టీలో విలీనం కాకపోతే షిండే బ్యాచ్ పై అనర్హత వేటు పడేనా?
- మూడింట రెండొంతుల మంది వేరే పార్టీలో విలీనం అవ్వాలంటున్న శివసేన న్యాయవాది
- లేకపోతే అనర్హత వేటు వర్తిస్తుందని కామెంట్
- పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే అనర్హత తప్పదని స్పష్టీకరణ
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురి కాకూడదని అనుకుంటే.. ఒక పార్టీ నుంచి కనీసం మూడింట రెండొంతుల మంది వేరు పడాలి. ఈ ప్రకారం శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ షిండేకు కనీసం 37 మంది మద్దతు అవసరం. శివసేనకు మొత్తం 55 మంది సభ్యుల బలం ఉంది. తనకు 37 మంది కంటే ఎక్కువ మంది మద్దతు గా ఉన్నారని షిండే చెబుతూ వస్తున్నారు. వీరంతా అసోం రాజధాని గువాహటిలోని ఓ హోటల్ లో వారం రోజులుగా మకాం వేసి ఉండడం తెలిసిందే.
అయితే శివసేన న్యాయవాది దేవదత్ కామత్ వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ‘‘ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడింట రెండొంతుల మెజారిటీ అన్నది కేవలం వేరే పార్టీలో విలీనం సందర్భంలోనే వర్తిస్తుంది. షిండే బృందం వేరే పార్టీలో విలీనం కానంత వరకు వారికి అనర్హత వర్తిస్తుంది. ఇప్పటి వరకు వీరు (శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు) ఏ పార్టీలోనూ విలీనం కాలేదు. అంటే వారు స్వచ్ఛందంగా సభ్యత్వాలు వదులుకున్నట్టే’’ అని వివరించారు.
‘‘16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చర్యలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే.. అతడు అనర్హతకు అర్హుడు అవుతాడు’’ అని కామత్ చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం అంటే అది పార్టీ వ్యతిరేక చర్య అవుతుంది. అటువంటి చర్యలు అనర్హతకు దారితీస్తాయి’’ అని తెలిపారు.
ఇదిలావుంచితే... షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన పార్టీ పంపిన అనర్హత నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేయడం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేయనుంది.