Hardik Pandya: విజయారంభం అదుర్స్.. మాలిక్ కు మరో చాన్స్: పాండ్యా
- మన జట్టుకు విజయంతో మొదలు పెట్టడం కీలకమన్న పాండ్యా
- ఉమ్రాన్ మాలిక్ కు మరో చాన్స్ లభిస్తుందని స్పష్టీకరణ
- హ్యారీ షాట్లు విస్మయానికి గురి చేశాయని కామెంట్
ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ ను విజయంతో ప్రారంభించడం పట్ట కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆదివారం మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ తీసుకోవడం తెలిసిందే. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా మొదలైంది. దీంతో 12 ఓవర్లకు కుదించారు. 103 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు కేవలం మూడు వికెట్లు నష్టపోయి సునాయాసంగా గెలిచేసింది. దీంతో మ్యాచ్ తర్వాత పాండ్యా మీడియాతో మాట్లాడాడు.
‘‘సిరీస్ ను విజయంతో మొదలు పెట్టడం గొప్పగా ఉంది. మన జట్టుకు విజయారంభం ఎంతో ముఖ్యమైనది. ఉమ్రాన్ తో నేను మాట్లాడిన తర్వాత కాస్త వెనక్కి తగ్గాడు. అతడు పాత బంతితో ఎంతో సౌకర్యంగా అనిపించాడు. వారు (ఐర్లాండ్) బాగా బ్యాట్ చేశారు’’ అని పాండ్యా పేర్కొన్నాడు.
మాలిక్ కు భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడడం ఇదే మొదటిసారి. అది కూడా ఐర్లాండ్ తో మొదటి టీ20లో ఒకే ఓవర్ కు పరిమితం అయ్యాడు. 14 పరుగులు ఇచ్చుకున్నాడు. అయినా, ఉమ్రాన్ మాలిక్ కు పాండ్యా మద్దతు ప్రకటించాడు. ఉమ్రాన్ తనను తాను నిరూపించుకునేందుకు వీలుగా రెండో టీ20లోనూ అవకాశం దక్కించుకుంటాడని చెప్పాడు.
‘‘దాదాపు అతడు మరో అవకాశం దక్కించుకుంటాడు. హ్యారీ ఆడిన కొన్ని షాట్లు నన్ను విస్మయానికి గురి చేశాయి. అతడు ఐర్లాండ్ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళతాడని ఆశిస్తున్నాను’’ అని పాండ్యా ప్రకటించాడు.