Maharashtra: ఎనిమిది మంది మంత్రులపై వేటు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆదేశాలు
- వారి శాఖలు ఇతర మంత్రులకు అప్పగింత
- తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే శాఖలూ తొలగింపు
- ప్రజా సంక్షేమ కార్యక్రమాలు స్తంభించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
తిరుగుబాటు చేసిన మంత్రులపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేటు వేశారు. తొమ్మిది మంది మంత్రుల శాఖలను తొలగించి.. వాటిని ఇతర మంత్రులకు అప్పగించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు.
“ఎనిమిది మంది మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు. దీనితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు స్తంభించిపోవడానికి వీలు లేదు. అందువల్ల వారి బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగిస్తున్నాం..” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో అస్సాంలోని గువాహటి క్యాంపులో ఉన్నారు.
ఇప్పటివరకు తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే పరిధిలో ఉన్న పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖను మరో మంత్రి సుభాష్ దేశాయ్ కు అప్పగించారు. గులాబ్ రావ్ పాటిల్ నుంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖను తొలగించి.. మరో మంత్రి అనిల్ పరబ్ కు అప్పగించారు. మరో ఆరుగురి శాఖలను కూడా మార్చారు.