Maharashtra: షిండే వర్గం పిటిషన్లపై మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు.. అనర్హత నోటీసులపై రెబల్స్ కు ఊరట
- డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికీ నోటీసుల జారీ
- 5 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు
- ఆపై 3 రోజుల్లోగా రిజాయిండర్లు దాఖలు చేయాలని సూచన
- అనర్హత నోటీసులపై జవాబు గడువును జులై 12కు పొడిగింపు
- తదుపరి విచారణను వచ్చే నెల 11కి వాయిదా వేసిన కోర్టు
శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు... మహారాష్ట్రలో తమకు ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నాయని, ఫలితంగా అత్యవసరంగానే సర్వోన్నత న్యాయస్థానానికి రావాల్సి వచ్చిందన్న షిండే వర్గం తరఫు న్యాయవాది వాదనకు శాంతించింది. ఆపై పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శులకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై 5 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు వారిని ఆదేశించింది. ఆ తర్వాత మరో 3 రోజుల్లోగా రిజాయిండర్లు దాఖలు చేయాలని సూచించింది.
అలాగే జూన్ 27 సాయంత్రం 5.30 లోగా అనర్హత నోటీసులపై జవాబు ఇవ్వాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువును సుప్రీం జులై 12 వరకు పొడిగించింది. దీంతో రెబల్స్ కు ఈ విషయంలో ఊరట లభించింది. ఇక తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.