Agnipath Scheme: అగ్నివీరుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచండి: మమతా బెనర్జీ
- తీవ్ర విమర్శలపాలైన అగ్నిపథ్
- అయినా వెనుకంజ వేయని కేంద్రం
- అగ్నిపథ్ కింద నియామకాల ప్రారంభం
- నాలుగేళ్ల తర్వాత వాళ్ల భవిష్యత్ ఏంటన్న మమత
సైనిక నియామకాల కోసం తీసుకున్న అగ్నిపథ్ విధానంపై తీవ్ర ఆగ్రహజ్వాలలు రేగినప్పటికీ కేంద్రం వెనుకంజవేయలేదు. తాజాగా త్రివిధ దళాల నియామకాల కోసం ఈ పద్ధతిలోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అగ్నిపథ్ కు భారీ స్పందన వస్తోందన్న ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అగ్నిపథ్ విధివిధానాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
అగ్నిపథ్ పథకం ద్వారా నియమితులయ్యే అగ్నివీరుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల పదవీకాలం ముగిసేసరికి వారికి భవిష్యత్ అనిశ్చితికరంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సైనిక నియామక విధానాన్ని తెరపైకి తెచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు.
"బీజేపీలాగా కాకుండా ఎన్నో, మరెన్నో ఉద్యోగాలు కల్పించాలనేది నా ఆశయం. కానీ బీజేపీ వాళ్లు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించేందుకు నియామకాలు చేపడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ సైనికులు ఏంచేయాలి? వాళ్ల తలరాత ఏంటి? దీనిపై అనిశ్చితి నెలకొని ఉంది" అని మమతా బెనర్జీ వివరించారు.