Amaravati: హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్... రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- కౌలు కోసం హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్
- మంగళవారం పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న హైకోర్టు
- సోమవారమే కౌలు నిధులను విడుదల చేసిన సీఆర్డీఏ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన కౌలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో సోమవారం రైతుల ఖాతాల్లో కౌలు నిధులను జమ చేస్తూ సీఆర్డీఏ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ నేపథ్యంలోనే హడావిడిగా సీఆర్డీఏ అధికారులు రైతుల ఖాతాల్లో కౌలు నిధులను జమ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ తమ పొలాలకు సంబంధించి కౌలు నిధుల విడుదల కోసం అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాడు కూడా తక్షణమే రైతుల ఖాతాల్లో కౌలు నిధులను జమ చేయాలంటూ సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాటి తీర్పు నేపథ్యంలో ఈ దఫా కూడా రైతుల పిటిషన్‌పై హైకోర్టు విచారణకు ఒక రోజు ముందుగా రైతుల ఖాతాల్లో సీఆర్డీఏ కౌలు నిధులను జమ చేయడం గమనార్హం.