Prime Minister: అంతమంది దేశాధినేతల్లో ప్రధాని మోదీ స్పెషల్.. జీ7 సదస్సు గ్రూప్ ఫొటో విడుదల చేసిన పీఐబీ
- మ్యూనిక్ లో జీ7, ఇతర దేశాధినేతలతో మోదీ గ్రూప్ ఫొటో
- సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న ప్రధాని
- ట్విట్టర్, కూ యాప్ లలో పోస్ట్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
జీ7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీలోని మ్యూనిక్ కు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ సదస్సులో పాల్గొన్న దేశాధినేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా మిగతా అందరు దేశాధిపతులు కోటు వేసుకుని ఫార్మల్ వస్త్రధారణలో కనిపించగా.. ప్రధాని మోదీ మాత్రం తనకే ప్రత్యేకమైన సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. అంతకుముందు దేశాధినేతలంతా విడివిడిగా ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రధాని మోదీతో పాటు భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తమ ట్విట్టర్ ఖాతాల్లో ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేశారు. పీఐబీ దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’లోనూ ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలు, పర్యావరణ, ఆర్థికపరమైన అంశాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో జీ7 సదస్సును చేపట్టారు. 26నే మ్యూనిక్ కు చేరుకున్న ప్రధాని మోదీకి జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షూల్జ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జర్మనీలో సదస్సుతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.