Narendra Modi: మోదీతో కరచాలనానికి నేతలను దాటుకుంటూ వెళ్లి.. భుజం తట్టి కరచాలనం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో ఇదిగో
- జీ7 దేశాల సదస్సు కోసం మ్యూనిక్ వెళ్లిన మోదీ
- ఆయా దేశాధినేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన ప్రధాని
- బైడెన్‌తో ఆత్మీయ కరచాలనం చేసిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కరచాలనం కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమితాసక్తి ప్రదర్శించారు. ఇతర దేశాధినేతలను దాటుకుంటూ వెళ్లిన బైడెన్... మోదీ వెనకాల నిలిచి భుజం తట్టి మరీ పిలిచి మోదీతో కరచాలనం చేశారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
జీ7 దేశాల సదస్సు కోసం మోదీ జర్మనీలోని మ్యూనిక్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీ7 దేశాధినేతలు గ్రూప్ ఫొటో తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా దేశాధినేతలతో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కనిపించిన మోదీ కుడి వైపున చివరలో ఉన్నారు. మోదీ నిలిచిన వైపుకు అవతలి వైపున ఉన్న బైడెన్ ఆయా దేశాధినేతలను వారి వెనుకగా దాటుకుంటూ మోదీ వద్దకు వచ్చారు.
అయితే వెనక వైపున వస్తున్న బైడెన్‌ను ఇతర దేశాధినేతలు గమనించలేదు. మోదీ కూడా గమనించలేదు. ఈ క్రమంలో మోదీ వెనక ఓ మెట్టు పైన నిలబడి మోదీ భుజంపై చేయి వేసి పిలిచిన బైడెన్... మోదీతో కరచాలనం చేశారు. బైడెన్‌కు చేయి అందిస్తూనే తన కోసమే ఆయన అక్కడికి వచ్చారన్న విషయాన్ని గ్రహించిన మోదీ... బైడెన్ నిలబడ్డ మెట్టుపైకి ఎక్కి ఆయనతో ఆత్మీయ కరచాలనం చేశారు.