YSRCP: ప్రొద్దటూరు వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి ముస్లింల యత్నం
- ప్రొద్దటూరులో దర్గా జెండా చెట్టును కూల్చేసిన అధికారులు
- నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు
- వారితో చర్చలు జరిపిన ఎమ్మెల్యే రాచమల్లు
- ఆపై ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించిన ముస్లింలు
- కూల్చిన చోటే జెండాను ఏర్పాటు చేస్తామన్న అధికారులు
- శాంతించి వెనక్కు తగ్గిన ముస్లింలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది. పట్టణంలోని జెండా చెట్టు కూల్చివేతకు సంబంధించి నెలకొన్న వివాదంపై చర్చలు జరిపి ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంగా ఆయన కారుపై ముస్లిం వర్గానికి చెందిన కొందరు దాడికి యత్నించారు. అయితే అప్రమత్తమైన రాచమల్లు అనుచరులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.
ఈ ఘటన వివరాల్లోకెళితే... పట్టణంలోని దర్గా జెండా చెట్టును సోమవారం మునిసిపల్ అధికారులు తొలగించారు. దీనిపై ముస్లింలు ఆందోళనకు దిగగా...వారితో చర్చించేందుకు ఎమ్మెల్యే రాచమల్లు తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన వివరాలను సావదానంగానే విన్న ముస్లింలు ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వెంటనే ఆయన కారుపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన రాచమల్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు.
అనంతరం కారు దిగిన రాచమల్లు మునిసిపల్ అధికారులను అక్కడికి పిలిపించారు. దర్గా జెండా చెట్టును కూల్చి వేసిన చోటనే జెండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు బుధవారం జెండా చుట్టూ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. దీంతో శాంతించిన ముస్లింలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.