Telangana: చికెన్‌తో వంకాయ కర్రీ వడ్డింపు!.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్!
- 107 మందికి తీవ్ర అస్వస్థత
- ఆసుపత్రికి తరలించిన అధికారులు
- ఘటనపై మంత్రి హరీశ్ రావు ఆరా
తెలంగాణ గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన ఈ ఘటనలో 107 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హరీశ్ రావు అధికారులను ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఈ పాఠశాలలో ఆదివారం రాత్రి చికెన్‌తో కలిపి వంకాయను వడ్డించారట. ఆ వెంటనే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. తీరా సోమవారం నాటికి వారికి కడుపు నొప్పి తీవ్రం కావడంతో వారంతా అధికారులకు తెలిపారు. దీంతో హుటాహుటీన అధికారులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.