Scorpio-N: భారత మార్కెట్లోకి సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్
- విజయవంతమైన మహీంద్రా స్కార్పియో
- అప్ డేటెడ్ మోడల్ గా స్కార్పియో-ఎన్
- ప్రారంభ ధర రూ.11.49 లక్షలు
- ఐదు వేరియంట్లలో ఉపలబ్దం
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన పోర్ట్ ఫోలియోలో అత్యంత విజయవంతమైన వాహనం స్కార్పియోను మరింత ఆధునికీకరించి స్కార్పియో-ఎన్ పేరిట భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, గరిష్ఠ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్ షోరూం). ఇందులో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు... ఆటోమేటిక్, ఫోర్ వీల్ డ్రైవ్ వంటి 5 వేరియంట్లు ఉన్నాయి.
ప్రస్తుతం తాము ప్రకటించిన ధరలు తొలి 25 వేల బుకింగ్ ల వరకే వర్తిస్తాయని, ఆ తర్వాత కొత్త ధరలు ప్రకటిస్తామని మహీంద్రా వర్గాలు తెలిపాయి. జులై 30న స్కార్పియో-ఎన్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని, భారత్ తో పాటు దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి దేశాల్లోనూ ఈ ఎస్ యూవీ అమ్మకాలు షురూ అవుతాయని మహీంద్రా వెల్లడించింది. మిగిలిన దేశాల్లో 2023 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
ఇందులో ప్రధానంగా 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఎంస్టాలియన్ టర్బో ఇంజిన్ ను పొందుపరిచారు. డీజిల్ వెర్షన్లో 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఎస్ యూవీ సెగ్మెంట్లో స్కార్పియో-ఎన్ అత్యంత తక్కువగా కర్బన ఉద్గారాలు వెలువరించే మోడల్ అని మహీంద్రా సంస్థ పేర్కొంది.