Maharashtra: చెత్త అంతా బయటికెళ్లినందుకు సంతోషంగా ఉంది: శివసేన యువ నేత ఆదిత్య థాకరే కామెంట్
- అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయన్న ఆదిత్య
- అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శ
- షిండేకు ఉద్ధవ్ థాకరే సీఎం పదవిని ఆఫర్ చేశారన్న మంత్రి
- ఆఫర్‌ను తిరస్కరించి షిండే డ్రామాలు ఆడుతున్నారని ధ్వజం
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై శివసేన యువ నేత, మంత్రి ఆదిత్య థాకరే సోమవారం రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు బయటకెళ్లిపోయిన వైనంపై స్పందించిన ఆయన... చెత్త అంతా బయటకెళ్లిపోయినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను శివసేన కార్యకర్తలతో మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీపై తిరుగుబాటు చేసినందుకు ఏక్‌నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేల్లో ఆవేదన ఉందని కూడా థాకరే వ్యాఖ్యానించారు. అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే...అక్కడికి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారని ఆయన అన్నారు. గువాహటిలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ఒక్కరోజు భోజనం ఖర్చు రూ.9 లక్షలు అవుతోందన్న థాకరే.. ప్రైవేట్ విమానాల్లో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేలు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. షిండేకు ఉద్ధవ్ థాకరే సీఎం పదవిని ఆఫర్ చేశారన్న ఆదిత్య... షిండే మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించి డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.