KCR: హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్

CM KCR present at the swearing in ceremony of CJ Justice Bhuyan at rajbhavan
  • భూయాన్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్
  • అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి
  • కొన్ని నెలలుగా రాజ్‌భవన్‌కు దూరంగా కేసీఆర్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఆధికారిక కార్యక్రమంలో 10 గంటల 5 నిముషాలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌.. జస్టిస్ భూయాన్ చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ భూయాన్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డాక  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి. ఇప్పటిదాకా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పని చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కావటంతో, ఆయన స్థానంలో జస్టిస్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 

2019 లో ఏర్పాటైన రాష్ట్ర హైకోర్టు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ పని చేశారు. తర్వాత జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందించారు. ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ భూయాన్, ముంబై , అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించిన అనుభవం ఉంది. 

కాగా,  భూయాన్ ప్రమాణ స్వీకరానికి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత రాజ్ భవన్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్ కు గవర్నర్ తమిళిసైతో కూడా  పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తమిళిసై పాల్గొన్న పలు అధికారిక కార్యక్రమాలకు, రాజ్ భవన్ కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. దాంతో, హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవుతారో లేదో అన్నది చర్చనీయాంశమైంది. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్... గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించారు. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ ఇరువురూ నవ్వుతూ కనిపించారు.
KCR
Telangana
Governor
Tamilisai Soundararajan
TS High Court
chief justice
bhuyan
swearing in
rajbhavan

More Telugu News