Egg of the Sun: కిలో రూ.2.70 లక్షలు..? ఈ మామిడి పండ్లకు ఎందుకంత డిమాండ్?
- రుచిలో ఇది రారాజు అని జపాన్ వాసుల భావన
- జపాన్ లో రెండో అతిపెద్ద మామిడి పంట ఇదే
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోనూ ఓ రైతు క్షేత్రంలో ఈ మామిడి చెట్లు
ప్రపంచంలో అత్యంత తీపిగా ఉండే మామిడి పండు ఏదో చెప్పగలరా..? జపాన్ కు చెందిన మియాజాకి. దీన్ని పండ్లలో రాజుగా (కింగ్ ఆఫ్ ఫ్రూట్స్) చెబుతారు. ఈ మామిడి పండు పర్పుల్ రంగంలో ఉండడం మరో ప్రత్యేకత. ఈ మామిడి చాలా ఖరీదైన రకం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలు.
జపాన్ లోని మియాజాకి పట్టణంలో ఇది సాగవుతుంది. కనుక దీనికి ఈ పేరు. ఒక్కో పండు 350 గ్రాములు ఉంటుంది. ఇందులో చక్కెర పరిమాణం 15 శాతం. రంగు, ఆకృతి పరంగా ఈ మామిడి పండు ఇతర మామిడి పండ్లకు భిన్నంగా ఉండడాన్ని గమనించొచ్చు. జపాన్ వాసులు ఈ పండును ‘ఎగ్ ఆఫ్ సన్’ గా భావిస్తుంటారు. ఏటా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ సీజన్ లో మియాజాకి మ్యాంగో కాయలు దిగుబడికి వస్తాయి.
జపాన్ లో ఈ రకం పెద్ద మొత్తంలోనే సాగవుతుంది. ఒకినవా మ్యాంగో తర్వాత రెండో స్థానం దీనిదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం మియాజాకి రకం మామిడిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు సాగు చేస్తున్నారు. బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు కూడా పాకిపోయింది.