KCR: తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

KCR in Governor Tamilisai tea party
  • గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా వెళ్లని కేసీఆర్
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం
  • ఆత్మీయంగా మాట్లాడుకున్న గవర్నర్, ముఖ్యమంత్రి
తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా కేసీఆర్ వెళ్లలేదు. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరిగింది. ఉజ్జల్ భుయాన్ చేత తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే అనుమానాలకు తెరదించుతూ ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ పాత విభేదాలను పక్కన పెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒక టేబుల్ పై కూర్చొని ముచ్చటించారు. ఇదే సందర్భంగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరూ నవ్వుతూ ఆత్మీయంగా మాట్లాడుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
KCR
TRS
Tamilisai Soundararajan
Telangana
Governor

More Telugu News