akash chopra: ఆడలేనప్పుడు జట్టులో ఉంచుకోవడం ఎందుకు: ఆకాశ్ చోప్రా
- ఓపెనర్ గా వెంకటేశ్ అయ్యర్ కు చాన్స్ ఇవ్వాలన్న చోప్రా
- ఆ సామర్థ్యం లేనప్పుడు కొనసాగించడం ఎందుకని ప్రశ్న
- సంజు శామ్సన్, రాహుల్ త్రిపాఠీలకూ అర్హత ఉందని వ్యాఖ్య
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడం తెలిసిందే. ఫలితమే దీపక్ హుడా ఓపెనర్ గా వెళ్లడం. వచ్చిన చాన్స్ ను హుడా చక్కగా ఉపయోగించుకుని 47 పరుగులు సాధించాడు.
రుతురాజ్ కు పిక్కల్లో కండరాలు పట్టుకుపోవడంతో సమస్య ఏర్పడింది. అటువంటప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వెంకటేశ్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘మొదటి ప్రశ్న రుతురాజ్ అందుబాటు గురించే. అతడు ఇన్నింగ్స్ ను ప్రారంభించలేనప్పుడు ఎవరు అది చేయాలి? వెంకటేశ్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలి. అతడికి (అయ్యర్) ఆ సామర్థ్యం లేదని భావిస్తే జట్టులో ఉంచుకోవడం ఎందుకు. మీరేమీ టూరిస్ట్ వీసాపై వెళ్లలేదు.
సంజు శామ్సన్, రాహుల్ త్రిపాఠి కూడా ఉన్నారు. వారు కూడా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అర్హులే. సంజుకు అవకాశం ఇవ్వాలి. రాహుల్ త్రిపాఠీ కూడా జాబితాలో ఉన్నవాడే. ఐపీఎల్ లో వీరు లోగడ ఇన్నింగ్స్ ఆరంభించినవారే’’అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రుతురాజ్ గాయం చిన్నదేనని, దాంతో అతడిని ఓపెనర్ గా పంపకుండా వరుసలో ఉన్న తదుపరి ఆటగాడు హుడాకు అవకాశం ఇచ్చినట్టు కెప్టెన్ పాండ్యా స్పష్టం చేయడం తెలిసిందే.