Gujarat: జేసీబీని అడ్డుపెట్టి... రాడ్లు చేతబట్టి.. కారును చుట్టుముట్టి... నేరగాళ్ల అరెస్ట్‌కు గుజరాత్ పోలీసుల పాట్లు
- గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా ఛీక్లీఘర్ ముఠా స్వైర విహారం
- పోలీసులకు చుక్కలు చూపించిన 16 మంది సభ్యుల ముఠా
- పట్టుబడినా పోలీసులపై దాడులు చేస్తూ తప్పించుకున్న వైనం
- సూరత్ క్రైం బ్రాంచ్ పక్కా వ్యూహంతో ముఠా ఆటకట్టు
గుజరాత్ పోలీసు శాఖకు చెందిన ఓ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఓ నేరగాళ్ల ముఠాను పట్టుకునేందుకు గుజరాత్ పోలీసులు చేపట్టిన చర్యలు, నేరగాళ్లు ప్రయాణిస్తున్న వాహనంపై కర్రలు, రాడ్లు చేతబట్టుకుని ఏదో రౌడీ మూకల మాదిరి ఆ వాహనంపై దాడి చేస్తున్న పోలీసులకు చెందిన దృశ్యాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నేరగాళ్లు పారిపోకుండా వారి కారుకు ముందు ఓ జేసీబీని అడ్డుపెట్టడంతో పాటు రివర్స్‌లో జారిపోకుండా వెనుక ఓ పోలీసు వాహనాన్ని పెట్టి మరీ పోలీసులు నేరగాళ్లపై దాడి చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన వివరాల్లోకెళితే... గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఛీక్లీఘర్ ముఠా గత కొంతకాలంగా పోలీసులకు చుక్కలు చూపిస్తోందట. ఎలాగోలా పట్టుకున్నా.. పోలీసులపై దాడులు చేసి మరీ ఆ ముఠా సభ్యులు తప్పించుకుంటున్నారట. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సూరత్ క్రైం బ్రాంబ్ ఆ ముఠాను అరెస్ట్ చేసేందుకు పక్కా వ్యూహం రచించింది. ఓ వాహనంలో సదరు ముఠా సభ్యులు ప్రయాణిస్తున్న విషయాన్ని గ్రహించిన పోలీసులు... వారు ఎటుగా వెళతారన్న విషయాన్ని ముందే పసిగట్టారు. ఆ దారికి అల్లంత దూరాన రోడ్డుకు అడ్డంగా ఓ జేసీబీని నిలబెట్టేశారు. దానికి ఓ కీలో మీటర్ దూరంలో పలు వాహనాలతో ముఠా వాహనం కోసం కాపు కాశారు.
ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లుగానే ఛీక్లీఘర్ ముఠా వాహనం అటుగా వచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలీసులంతా మూకుమ్మడిగా ఆ వాహనంపై దాడికి దిగారు. రాడ్లు, లాఠీలు, కర్రలు చేతబట్టి ఆ వాహనంపై విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో భీతిల్లిపోయిన ముఠా... తమ వాహనాన్ని ముందుకు ఉరికించారు అయితే అప్పటికే అక్కడ రోడ్డుకు అడ్డంగా పోలీసులు నిలిపిన జేసీబీ ఉండటంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు.
అయితే అంతటి టెన్షన్‌లోనూ ఆ ముఠా సభ్యులు తమ వాహనాన్ని వెనక్కు పరుగు పెట్టించే యత్నం చేశారు. అయితే వాహనంపై దాడికి దిగిన వెంటనే రోడ్డుకు ఇంకో వైపున తమ వ్యాన్‌ను పోలీసులు అడ్డుగా పెట్టేశారు. ఫలితంగా ముందుకెళ్లలేక, వెనక్కు మరలలేక ముఠా సభ్యులు పోలీసులకు చిక్కిపోయారు. అప్పటిదాకా తమపై ఆ ముఠా సాగించిన దాడులను గుర్తు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పోలీసు జీపులోకి ఎక్కించారు.