Nara Lokesh: విపక్షాలు, ప్రజలు, అధికారులు అయిపోయారు... ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది: నారా లోకేశ్
- శ్రీకాళహస్తిలో జర్నలిస్టుపై దాడి
- వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారన్న లోకేశ్
- జర్నలిస్టుపై దాడికి తీవ్ర ఖండన
- కబ్జా చేసిన స్థలాన్ని అప్పగించాలంటూ డిమాండ్
తిరుపతి జిల్లాలో ఓ జర్నలిస్టుపై వైసీపీ నేత దాడి చేశాడంటూ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ వద్ద జర్నలిస్టు ఈశ్వర్ పై వైసీపీ నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయ బోర్డు మెంబర్ జయశ్యాం (బుల్లెట్ జయశ్యాం) దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్షాలు, ప్రజలు, అధికారులు అయిపోయారని... ఇప్పుడు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని వివరించారు. జర్నలిస్టు ఈశ్వర్ కి చెందిన స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడడం దారుణమని లోకేశ్ పేర్కొన్నారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన జయశ్యాంపై కఠినచర్యలు తీసుకోవాలని, కబ్జా చేసిన స్థలాన్ని జర్నలిస్టుకే చెందేలా చూడాలని డిమాండ్ చేశారు.