Telangana: జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
- ఇటీవలే ముగిసిన టెట్ పరీక్ష
- నోటిఫికేషన్ ప్రకారం నిన్ననే విడుదల కావాల్సిన ఫలితాలు
- సోమవారం రాత్రి దాకా విడుదల కాని ఫలితాలు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1న విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఫలితాలు ఈ నెల 27 (సోమవారం) విడుదల కావాల్సి ఉంది. అయితే సోమవారం రాత్రి దాకా ఈ ఫలితాలు విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఈ విషయంపై దృష్టి సారించిన మంత్రి జులై 1న ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఇటీవలే టెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో భాగంగా టెట్ పేపర్-1కు 3,18,506 మంది (90.60%) హాజరు కాగా.. పేపర్- 2కు 2,51,070 మంది (90.35%) మంది హాజరైన సంగతి తెలిసిందే.