Nasa: చందమామపై అడుగు పెట్టేద్దాం.. ముందస్తు శాటిలైట్ క్యాప్ స్టన్ ను ప్రయోగించిన నాసా
- సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి వెళ్లేందుకు మార్గం సుగమం
- ఆర్టిమిస్–1 మిషన్ లో భాగంగా నాసా తాజా ప్రయోగం
- నాలుగు నెలల తర్వాత చంద్రుడి సమీప కక్ష్యలోకి చేరనున్న ఉప గ్రహం
సుమారు 50 ఏళ్ల తర్వాత తిరిగి మానవుడు చందమామపై అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. చంద్రుడిపైకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను తలపెట్టిన నాసా.. అ దిశగా ముందస్తు పరిశీలన కోసం ‘క్యాప్ స్టన్’ ఉపగ్రహాన్ని మంగళవారం ప్రయోగించింది. న్యూజిలాండ్ లోని తూర్పు మహియా పెనిన్సులా నుంచి రాకెట్ ల్యాబ్ సంస్థకు చెందిన ఎలక్ట్రాన్ రాకెట్ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టేందుకు ‘క్యాప్ స్టన్’ ఒక గేట్ వే అని నాసా ప్రకటించడం గమనార్హం.
శాటిలైట్ చిన్నదే.. పని పెద్దది..
- తాజాగా నాసా ప్రయోగించిన ‘క్యాప్ స్టన్’ ఓ పెద్ద సైజు సూట్ కేసు పరిమాణంలో ఉంటుంది. ఇది నానో శాటిలైట్ అయినా కూడా.. అది నిర్వర్తించే బాధ్యతలు చాలా పెద్దవేనని నాసా చెప్తోంది.
- ఈ ఉప గ్రహం మొదట భూమి చుట్టూ తిరుగుతూ గ్రావిటీ నుంచి శక్తిని పుంజుకుని నాలుగు నెలల తర్వాత చంద్రుడి సమీపంలోకి చేరుతుంది.
- దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంగా 1,600 కిలోమీటర్లు, దూరంగా 43,500 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తుంది.
- ఈ సమయంలో చంద్రుడిపై వివిధ ప్రాంతాలను, అక్కడి పరిస్థితులను జల్లెడ పడుతుంది.
- క్యాప్ స్టన్ లో అత్యాధునిక పరికరాలు, రాడార్లు ఉన్నాయని.. భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రం నుంచి పెద్దగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే తనకు నిర్దేశించిన పనులను నిర్వర్తించేలా ఈ ఉప గ్రహాన్ని తీర్చిదిద్దామని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- ఇందులో వెల్లడైన డేటా ఆధారంగా నాసా మానవ సహిత అంతరిక్ష యాత్రలో తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు తుది నిర్ణయానికి రానున్నారు.