Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు.. కారణమిదేనంటూ సీఎస్ ఉత్తర్వుల జారీ
- వరుసగా రెండో సారి ఏబీవీ సస్పెన్షన్
- ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతల స్వీకరణ
- ఏబీవీ క్రమశిక్షణారహితంగా వ్యవహరించారన్న ఏపీ సీఎస్
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్‌కు గురైన వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇటీవలే తిరిగి సర్వీసులో చేరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డీజీగా ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును నియమించింది.
ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంకటేశ్వరరావు ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే క్రమశిక్షణా రహితంగా వ్యవహరించడంతో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మరోమారు సస్పెండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.