Pawan Kalyan: జనసేన కొత్త కార్యక్రమం 'జన వాణి'... ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan will start Jana Vani in Vijayawada

  • సామాన్యుడి గళం వినిపించేలా జన వాణి
  • ఐదు వారాల పాటు నిర్వహణ
  • తొలి రెండు వారాలు విజయవాడలో!
  • ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో కార్యక్రమం

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడి గళం వినిపించేలా 'జన వాణి' పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇకపై జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి 'జన వాణి' అని పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. 'జన వాణి'లో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ కల్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలు స్వీకరిస్తారు. 

జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో తొలి విడత 'జన వాణి' నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో ఆదివారం కూడా విజయవాడలోనే 'జన వాణి' ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో జన వాణి ఉంటుంది. 

కాగా, విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తారు. అంతేకాదు, అదే రోజు సాయంత్రానికి ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరేట్టు ప్రయత్నిస్తారు. ఆపై, తమ కార్యాలయం నుంచి ఆ అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తారు. 

రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ తో చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఈ 'జన వాణి' కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News