Agnipath Scheme: ‘అగ్నిపథ్’ వాయుసేనకు దరఖాస్తు గడువు మరో ఆరు రోజులే!
- ఇప్పటివరకు లక్షా 83 వేల దరఖాస్తులు
- వచ్చే నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం
- వయో పరిమితి పెంచడంతో మరింత డిమాండ్
అగ్ని పథ్ పథకం కింద భారత వాయుసేనలో చేరేందుకు పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహం చూపుతోంది. ఈ నెల 24న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా... ఈ ఆరు రోజుల్లోనే ఏకంగా లక్షా 83 వేలకుపైగా దరఖాస్తులు అందినట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తెచ్చిన కొత్త పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోందని పేర్కొన్నారు.
గరిష్ఠ వయసు పెంచడంతో దరఖాస్తుల వెల్లువ
త్రివిధ దళాల్లో సైనికులు, అధికారుల సగటు వయసును తగ్గించడం, యువతరానికి అవకాశం ఇవ్వడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న అగ్ని పథ్ పథకాన్ని ప్రకటించింది. తొలుత పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు మధ్య వారు దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధన పెట్టినా.. దేశవ్యాప్తంగా యువత నుంచి వచ్చిన నిరసనలు, డిమాండ్లతో గరిష్ఠ వయసును 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కాగా అగ్ని పథ్ కింద ఉద్యోగాల కోసం వాయుసేన ఈ నెల 24న నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి దరఖాస్తుల గడువు వచ్చే నెల 5న ముగియనుంది. అంటే మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉందని అధికారులు చెప్పారు.